Friday, March 22, 2013

నాగలాపురము



నాగలాపురము - ఈ పేరు ఎప్పుడైనా విన్నారా????????? తిరుపతికి 68 కి.మీ. దూరంలో మరియు చెన్నైకి 73 కి.మీ దూరంలో ఉన్నది ఈ ఊరు.

ఐతే ఏంటటా? అంటారా!!

ఈ ఊరిలో శ్రీ వేదనారాయణస్వామి వారి దేవాలయం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి మత్స్యావతారంలో కొలువై ఉన్నాడు.  "మత్స్యావతార, ప్రయోగ చక్రధారి శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామి" అన్నమాట.
మరి ఈ ఊరి గురించి, ఈ గుడి గురించి తెలుసుకుందామా...!! అయితే పదండి మరి.

స్థల పురాణము:  భూమి మీద ప్రాణికోటి ఏర్పడక ముందు, బ్రహ్మ దేవుడు స్రుష్టి కార్యము నెరవేర్చుటకు తపస్సు చేయుచుండగా, సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్దనుండి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు.  మరి వేదాలు లేకపోతే సమస్త జీవ స్రుష్టిని ఏర్పరచడం కష్టం కదా, అందుకని బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువుకి ఈ విషయం చెప్పి, ఈ విపత్తు నుండి కాపాడమని శరణు వేడారు.  అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదములను రక్షించుటకై, సోమకాసురునితో సముద్ర గర్బములో యుద్ధ్హము చేయటం కోసం మత్స్యావతారముగా అవతరించారు.  కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత సొమకాసురుని సంహరించి, వేదాలను బ్రహ్మదేవునికి అప్పగిస్తారు శ్రీ మహావిష్ణువు.  అలా శ్రీ మహా విష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన స్థలమే వేదపురి / వేదారణ్యక్షేత్రము / హరికంఠాపురము అని పేరుగాంచినది. ఆ వేదపురే ప్రస్థుత మన నాగలాపురము.

అంతే కాదు ఇక్కడ ఇంకొ విశిష్ఠత కూడా ఉంది.

ప్రాశస్త్యము:-  మత్స్యావతార రూపములో శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భమున సంవత్సరాల కొలది యుద్ధము చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరము వెచ్చదనము కొరకు సూర్యభగవానుడు తన కిరణములను స్వామి మీద ప్రసరింపజేసెను.  ఈ కారణముగానే నేటికి కూడా సూర్యపూజోత్సవముగా కొనియాడబడుతున్నది.  ప్రధాన రాజగోపురము నుండి 630 అడుగుల దూరములో గల మూలవిరాట్టుపై సూర్యకిర్ణాలు నేరుగా ప్రసరింపబడుతాయి.

మొదటి రోజున స్వామి పాదముల మీద, రెండవ రోజు నాభి మీద, మూడవ రోజు స్వామి శిరస్సు మీద సూర్యకిరణాలు ప్రసరింపబడి స్వామి దివ్య రూపమును తేజోవంతముగా చేయును.  ఈ అపురూప ద్రుశ్యాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి ఎందరో భక్తులు తరలి వస్తారు.

ఈ అపురూప ద్రుశ్యము ప్రతి సంవత్సరము ఆంగ్లమాసం మార్చి 23, 24, 25 / 24, 25, 26 తేదీలలో వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 24,25,26 తేదీలలో ఈ సూర్యపూజోత్సవం నిర్వహిస్తారు. 

అలానే ఇక్కడ సూర్యపూజోత్సవం కాకుండా ప్ర్తతి సంవత్సరం మార్చి నెల  25, 26, 27 / 26, 27, 28 తేదీలలో మూడురోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం కన్నులపండుగగా జరపబడుతుంది.  అంతే కాకుండా ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నుండి  10 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

అదండి ఈ గుడి విశిష్ఠత.  మరి ఇప్పుడు ఈ గుడికి ఎలా చేరుకోవాలో కుడా తెలుసుకుందాం.  

తిరుపతి ఆర్.టి.సి. బస్టాండు నుండి ప్రతి అరగంటకి నాగలాపురానికి బస్సు సౌకర్యము కలదు.  అదే కాకుండా తిరుపతి నుండి చెన్నై వెల్లే బస్సులు కుడా నాగలాపురం మీదుగా వెళతాయి. కాకపోతే బైపాస్ లో దిగి వెళ్ళాలి.

మరి అయితే ఇప్పుడు ఈ గుడి విశేషాలు తెలుసుకున్నారు కదా, 

ఈ స్వయంభూ మత్స్యావతార శ్రీ వేదనారాయణస్వా మి కొలువై ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని మనశ్శాంతిని, సకల సౌభాగ్యాలను పొందండి.